కందనవోలు విజయవాడ,

ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి ఈ ఘటనపై స్పందించాలని కోరుతూ అదనపు డీసీపీకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నూకరాజు కుటుంబానికి సంబంధించిన ఘటనపై మీడియాలో వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సాధిక్‌ ఖాన్‌పై మోసం, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ తదితర తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరారు. ఘటనకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఇలాంటి కేసులను కేవలం ప్రేమ, ఆర్థిక వివాదాలుగా పరిగణించకుండా ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు అన్నారు. బాధితులు పోలీస్‌ స్టేషన్లకు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి, అవసరమైన రక్షణ కల్పించాలని కోరారు. కేసులపై కౌన్సెలింగ్ పేరుతో బాధితులను వెనక్కి పంపకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. నూకరాజు కుటుంబ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందో తేల్చాలని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై ఇప్పటివరకు నమోదైన ఫిర్యాదులు ఎన్ని, ఎన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, తీసుకున్న చర్యలు ఏమిటి, దర్యాప్తు ఏ దశలో ఉంది అనే వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా మతం, రాజకీయ సంబంధాలతో సంబంధం లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవిందు, జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్ జైన్, సీనియర్ నాయకులు వాసా పల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.

You missed