కందనవోలు కర్నూలు
కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్ వద్ద ఉన్న ఫన్ అండ్ ఫుడ్లో స్పార్టన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా ఈవెంట్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి దాండియా ఆడి సందడి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొనడం మంచి పరిణామమని పేర్కొన్నారు. యువత విద్య, క్రీడలు, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.
యువతలోని ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు యువతకు ఏ విధమైన సహకారం అవసరమైనా అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని మంత్రి భరోసా ఇచ్చారు. యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష, యువ నాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి, మల్లికార్జున ఫర్నిచర్ అధినేత రాజగోపాల్, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు.
