కందనవోలు న్యూస్  విజయవాడ

 

విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ బేస్డ్‌ జాబ్‌ ఫ్రాడ్స్‌, సైబర్‌ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీపీ ఉత్తర్వుల మేరకు గవర్నర్‌పేట సీఐ బి. బాలమురళీకృష్ణ తమ సిబ్బందితో కలిసి లెనిన్‌ సెంటర్‌లో ప్రజలకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా ఇంటి వద్ద ఉండే మహిళలు, వృద్ధులు టాస్క్‌ బేస్డ్‌ జాబ్‌ ఫ్రాడ్స్‌కు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చంటూ గుర్తుతెలియని వ్యక్తులు పంపే సందేశాలు, లింకులు, ఉద్యోగ ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు.
అలాగే సైబర్‌ నేరాల నియంత్రణలో ఉపయోగపడే అస్త్రం యాప్‌ గురించి ప్రజలకు వివరించారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, దాని ద్వారా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
టాస్క్‌ బేస్డ్‌ ఉద్యోగాల పేరుతో ఎవరైనా ముందుగా డబ్బులు చెల్లించాలని కోరినా, అనుమానాస్పద లింకులు పంపినా స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ బాలమురళీకృష్ణ సూచించారు. ప్రజలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులు మరియు మహిళలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.

You missed