కందనవోలు కర్నూలు 
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ హరి అగ్రికల్చర్ కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, ప్రకృతి వనరుల సంరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సోమన్న మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వంటి కారణాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.అనంతరం డాక్టర్ ఫ్లోరెన్స్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల కరెస్పాండెంట్ హరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను కళాశాలలో నిరంతరం నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
