కందనవోలు ఆదోని

 

ఆదోనిలో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన వీఆర్వో బీటీ సురేష్.. బత్తిని కుబేర్నాథ్ వ్యవహారంపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. బత్తిని కుబేర్నాథ్ కుటుంబాన్ని, అలాగే వీఆర్వో బీటీ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న వ్యక్తిగత వివాదాన్ని కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం కుల రంగు పులిమి పెద్ద స్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు.

బీసీ సమాజంలో ఐక్యత దెబ్బతినేలా కొందరు స్వార్థపూరిత నాయకులు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రేరణతో కొంతమంది బీసీ కుల సంఘాల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, సమాజంలో విభేదాలు పెంచుతున్నారని అన్నారు. బీసీలు బీసీలతోనే కొట్టుకునే పరిస్థితి రావడం బాధాకరం. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో మనం పావులుగా మారకూడదు. అగ్రవర్ణాల ఉచ్చులో పడి మనలో మనం దూషించుకోవడం, ధర్నాలు చేయడం వల్ల నష్టపోయేది బీసీ సమాజమే అని పేర్కొన్నారు.
బత్తిని కుబేర్నాథ్ రాజకీయంగా ఎదుగుతున్న నేపథ్యంలో కావాలనే కొందరు అతడిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చిన్న సంఘటనను కిడ్నాప్ కేసు స్థాయికి తీసుకెళ్లి ఆదోని పట్టణంలో ఉద్రిక్తతలు సృష్టించడం వెనుక రాజకీయ కోణం ఉందని అన్నారు. ఈ వివాదాన్ని ఆధారంగా చేసుకొని కొందరు నాయకులు తమ వ్యక్తిగత లాభాల కోసం కుల సంఘాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
బీసీ యువత, కుల సంఘాల నాయకులు ఎవరూ ప్రేరేపిత రాజకీయాలకు లోనుకాకుండా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. పరస్పర విమర్శలు, ఆరోపణలు ఆపి సామరస్య వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఇరువురినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పార్థసారథి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, మదాసి మదరి కురువ సంఘం నాయకులు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You missed