కందనవోలు పులివెందుల,
బక్రీద్ పండుగను సమాజంలో శాంతి, సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ప్రజలకు సూచించారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవ భావంతో వ్యవహరిస్తూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పండుగను నిర్వహించుకోవాలని కోరారు.
ప్రత్యేకంగా జంతువధ శాలల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మతపరమైన లేదా సున్నితమైన అంశాల విషయంలో సహనం, సంయమనం పాటిస్తూ సంప్రదాయాలను గౌరవించుకోవాలని అన్నారు. బక్రీద్ పండుగ నిర్వహణ, సంప్రదాయాలపై అన్ని మతాలకు చెందిన యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
