కందనవోలు కర్నూల

డ్రైవింగ్‌లో సత్ప్రవర్తన తప్పనిసరి,గోల్డెన్ అవర్ లో చికిత్స కు తోడ్పడాలి,:- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి,

 

 

 

డ్రైవింగ్ సమయంలో బాధ్యతతో వ్యవహరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో 37 వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లెక్చర్ హాల్ లో మెడికల్, కళాశాల విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులకు ప్రమాదాల నివారణ, గుడ్ సమారిటన్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం, అతివేగం, మత్తులో వాహనం నడపడం వంటి చర్యలు అమూల్యమైన ప్రాణాలను హరించేస్తున్నాయని , కర్నూలు జిల్లాలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా 330 మంది మృతి చెందగా, 719 మంది గాయపడ్డారని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల యువకులే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వయస్సు వారు కుటుంబాలకు, సమాజానికి, దేశానికి అత్యంత విలువైన సంపద అని కలెక్టర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం (ఓవర్ స్పీడ్), మత్తులో వాహనం నడపడం (డ్రంకన్ డ్రైవ్), ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించకపోవడం వంటి అంశాలే కారణమవుతున్నాయని తెలిపారు. ఈ చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానానికి కనీసం 10 నిమిషాలు ముందుగా బయలుదేరే అలవాటు చేసుకుంటే, అతివేగం తగ్గించి ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు. ఇటీవల కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మత్తులో వాహనం నడపవద్దని, ఇతరుల ప్రాణాలతో పాటు తమ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేయవద్దని కలెక్టర్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదం జరిగితే, ప్రమాదం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితులను ఆసుపత్రికి చేర్చడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. అలా సహాయం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గుడ్ సమారిటన్ పథకం కింద రూ. 25,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తారని చెప్పారు. సహాయం చేసిన వారి వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అలాగే కార్లు నడిపే వారు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం విధించిన రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. సమిష్టి బాధ్యతతో, రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగితే ఈ ఏడాది కనీసం 50 శాతం వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంత కుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, నిద్ర లేకుండుట ప్రధాన కారణాలని తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆటో, లారీ, ద్విచక్ర వాహనదారులతో పాటు విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రహదారి నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స, రక్తస్రావం నియంత్రణ, అత్యవసర వైద్య సేవలు అందించగలిగితే మరణాల శాతం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారిని ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రాణ రక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. ఆర్టీవో భరత్ చౌహాన్, ఎం.వి.ఐ. బాబు కిషోర్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రహదారి సూచనలు, గుర్తులు, ప్రమాదాలు జరగటానికి కారణాలు వివరిస్తూ వీడియో లు ప్రదర్శించి వివరించారు. హెల్మెట్ వాడటం, సీటు బెల్ట్ వినియోగం చేస్తామని ప్రమాణం చేయించారు.

అనంతరం 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు – 2026 సంబంధించి రహ – వీర్, గుడ్ సమారిటన్ పోస్టర్ ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. చిట్టి నరసమ్మ, డి ఎమ్ హెచ్ఓ డా. భాస్కర్ , అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం ఐ.ఎమ్.ఏ ప్రతినిధి డా రామ్మోహన్ రెడ్డి , ఆర్ టి ఓ భరత్ చౌహాన్ , నర్సింగ్ కాలేజ్ వేణుగోపాల్ , అసిస్టెంట్విఎమ్ వి ఐ బాబు కిషోర్, చౌహాన్, నర్సింగ్ సూపర్వైజర్ సావిత్రి బాయి పాల్గొన్నారు.

You missed