కందనవోలు కర్నూలు
కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షేక్ ముంతాజ్ (28), భర్త షేక్ మునావర్, ఇబ్రహీం మసీదు, గడ్డం స్టేట్, కర్నూలు నివాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదు ప్రకారం, గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఉపేంద్ర మరియు వీరారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఎయిర్టెల్ కంపెనీ ఉచిత సిమ్ కార్డులు అందజేస్తున్నామని చెప్పి, ఫిర్యాదుదారురాలి వేలిముద్రలు, ఐరిష్ స్కాన్ మరియు ఆధార్ వివరాలను సేకరించి ఎయిర్టెల్ సిమ్ కార్డు అందజేశారు. అనంతరం ఆ సిమ్ నంబర్‌ను ఆమె తన ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకుని బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ వచ్చింది. తేదీ 22.07.2026న “తల్లికి వందనం” పథకం నగదు తన బ్యాంకు ఖాతాలో జమ కాలేదని తెలుసుకున్న ఫిర్యాదుదారురాలు సంబంధిత సచివాలయంలో విచారించగా, ఆ మొత్తం ఎయిర్టెల్ పేమెంట్స్ డిజిటల్ బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు తెలిసింది. అనంతరం ఎయిర్టెల్ కార్యాలయంలో విచారణ చేయగా, ఆమె పేరుతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉన్నట్లు, అందులో రూ.26,000/- జమ కాగా, అందులో రూ.12,000/-ను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమంగా ఉపసంహరించినట్లు గుర్తించారు. ఇదే విధంగా షేక్ హసీనా, షేక్ పర్వీన్ భాను, బేగం, పఠాన్ రేష్మా, షేక్ పర్వీన్, షేక్ షాజహాన్, షేక్ ముస్కాన్, షేక్ ఫాతిమా తదితర పలువురి “తల్లికి వందనం” పథకం నగదును కూడా ఇదే తరహాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా ఉపసంహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై బాధితులు ఉపేంద్ర మరియు వీరారెడ్డిని ప్రశ్నించగా, తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా వన్ టౌన్ పరిధిలో మరికొందరు కూడా ఇదే తరహా మోసానికి గురైనట్లు తెలిసి, బాధితులంతా కలిసి కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మోసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు కర్నూలు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
