కందనవోలు శ్రీశైలం

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్న కురువ కులానికి చెందిన సుమారు 20 నుంచి 25 కుటుంబాలపై ఇతర కులస్తులు దాడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో చోటుచేసుకున్న గొడవలో కురువ కులస్తులను లక్ష్యంగా చేసుకొని దారుణంగా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో పలువురు కురువ కులస్తులకు గాయాలయ్యాయని, తమపై అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. తమకు ప్రాణభయం ఉందని, న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కురువ సంఘం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న కురువ సంఘం తరఫున అందుబాటులో ఉన్న నాయకులు, సభ్యులు రేపు శ్రీశైలానికి చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంఘం ప్రతినిధులు ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా నిలవనున్నారని వెల్లడించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే కూడా శ్రీశైలానికి వచ్చి సమస్యను తెలుసుకునే అవకాశం ఉందని సమాచారం. బాధిత కురువ కుటుంబాలకు న్యాయం చేయాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
