కందనవోలు కర్నూలు

 

 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వర్లు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దళితుల రక్షణలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
రాయలసీమ ప్రాంతంలో వరుస ఘటనలు ఆందోళనకరమని పేర్కొంటూ, ఆలూరు తాలూకా చిప్పగిరి మండలంలో గుంటకల్ సమీపంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు లక్ష్మీనారాయణను టిప్పర్‌తో గుద్ది, వేటకొడవలతో దారుణంగా హత్య చేసిన ఘటనను ప్రస్తావించారు. అలాగే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఎం. రమేష్ మాదిగను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను కూడా తీవ్రంగా ఖండించారు.
ఆదోనిలో మహిళపై జరిగిన దారుణ ఘటన, పత్తికొండ తాలూకా మద్దికేర గ్రామానికి చెందిన విలేకరి తిరుమలరెడ్డి హత్య కేసు, పిన్నెల్లి గ్రామంలో సల్మాన్ మాదిగ హత్య వంటి ఘటనలు దళితులపై పెరుగుతున్న హింసకు నిదర్శనమని అన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను ఊరినుంచి బహిష్కరించిన ఘటనపై స్పందించాలని కోరారు. అలాగే మంత్రి నారా లోకేష్ పేరును ప్రస్తావిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ ఘటనలపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తగిన న్యాయం జరగడం లేదని, ఇతర వర్గాల కేసుల్లో భారీ పరిహారాలు అందుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులపై దాడులు ఆపకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

You missed