కందనవోలు కర్నూలు
శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించడం ఎంతో బాధాకరమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన ఆలయశుద్ధి కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ నేతలు శాసనమండలిలో వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ఎన్నో ముఖ్యమైన అంశాల గురించి చర్చించకుండా సభను జరగకుండా చేశారన్నారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమన్నారు. తప్పు జరిగింది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా వాదిస్తున్నారని, తిరుమల వెళ్లి తప్పు జరిగిందని ఒప్పుకొని దేవుడిని మొక్కుకోవాలన్నారు. జగన్ వాస్తవాలు తెలుసుకొని ఇప్పటికైనా మారాలని ఆయన హితవు పలికారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్లు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. వైసీపీ నేతలకు బుద్ధి రావాలని వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ, బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, ఎం.ఎస్.ఎం.ఈ డైరెక్టర్ కౌశిక్, మార్కెట్ యార్డు డైరెక్టర్ మారుతి శర్మ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
