కందనవోలు కర్నూలు
తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ వ్యవహరించిన ధోరణి చూస్తుంటే హిందుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం ఏమైన ఉందా అన్న సందేహం కలుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లి ఒప్పుకొని స్వామి దగ్గర క్షమాపణలు చెప్పాలన్నారు. వైసీపీ నాయకుల ధోరణి ఇప్పటికీ మారడం లేదన్నారు. వైసీపీ అధ్యక్షునిగా జగన్‌ను మార్చి ఇంకో వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడైనా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగేందుకు అవకాశం ఉంటుందేమో అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. 2039 వరకు కూటమి అధికారంలో ఉంటుందని సీనియర్ ఐఏఎస్ లు తనతో చెప్పారన్నారు. కూటమి పాలన ఎంత బాగుందో దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. వెంకటేశ్వర స్వామి విషయంలో వైసిపి నేతల ప్రవర్తనను వారి ఇంట్లో వ్యక్తులు కూడా సమర్ధించబోరన్నారు. ఈ మీడియా సమావేశంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ, జనసేన జిల్లా అధ్యక్షులు సురేష్, బీజేపీ నాయకులు మురళి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
