కందనవోలు విశాఖపట్నం

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కీలక ధమనుల్లో ప్రాణాపాయ స్థాయిలో ఏర్పడిన రక్తగడ్డలను సకాలంలో గుర్తించి, అత్యవసర చికిత్సతో 65 ఏళ్ల రోగికి ప్రాణాపాయం నుంచి కాపాడారు కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధార వైద్యులు. చికిత్సనందించిన డా. రాజా కుమార్ పొన్నానా, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు, మరియు డా. వెంకటేష్ పోతుల, హెచ్‌ఓడీ, న్యూరో అండ్ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వివరాలను వెల్లడించారు.సుమారు నెల రోజులుగా రోగికి మళ్లీ మళ్లీ తల తిరుగుడు సమస్య కనిపించింది. అనంతరం ఒక్కసారిగా శరీరం ఒక వైపు బలహీనత రావడంతో మొదట శ్రీకాకుళంలో పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇక్కడి వచ్చారు.ఇక్కడ నిర్వహించిన అత్యవసర పరీక్షల్లో మెదడు కండర భాగానికి రక్తప్రసరణ అందించే వెర్టిబ్రల్‌, బసిలర్‌ ధమనుల్లో తీవ్రమైన అడ్డంకులు ఉన్నట్లు తేలింది. ఇవి ఎప్పుడైనా ప్రాణాంతక స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదకర పరిస్థితులు కావడంతో వైద్య బృందం అత్యవసర ఎండోవాస్క్యులర్‌ చికిత్సకు నిర్ణయించింది.అనంతరం న్యూరాలజీ, ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ నిపుణుల సమన్వయంతో శస్త్రచికిత్స లేకుండా రక్తనాళ మార్గం ద్వారా అడ్డంకిని తొలగించి, ప్రభావిత ప్రాంతంలో స్టెంట్‌ను విజయవంతంగా అమర్చారు. దీంతో మెదడుకు రక్తప్రసరణ మళ్లీ సాధారణమైంది.చికిత్స అనంతరం రోగిని ఐసీయూలో అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఫలితంగా అతను స్వల్ప నర బలహీనత మినహా మంచి స్థితికి చేరుకున్నాడు. ముందుగా బలహీనంగా మారిన చేతితోనే ‘థంబ్స్ అప్’ చూపగలిగే స్థాయిలో కోలుకోవడం వైద్య బృందానికి ఆనందం కలిగించిందన్నారు.స్ట్రోక్‌ చికిత్సలో ప్రతి నిమిషం అత్యంత విలువైనదని, లక్షణాలు కనిపించిన వెంటనే సరైన ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలతో పాటు మెదడు పనితీరును కూడా కాపాడవచ్చని వైద్యులు సూచించారు. చికిత్స ఆలస్యం అయితే అవకాశం తగ్గిపోతుందని, ప్రజల్లో స్ట్రోక్‌ లక్షణాలపై మరింత అవగాహన అవసరమని పేర్కొన్నారు.వేగవంతమైన నిర్ణయం, విభాగాల మధ్య సమన్వయం, నిపుణులైన వైద్యుల తక్షణ జోక్యంతో రోగి ప్రాణాలు నిలబెట్టడమే కాకుండా, అతన్ని తీవ్రమైన వైకల్యం నుంచి కూడా రక్షించగలిగాం వైద్యులు తెలిపారు.