కందనవోలు ఆలూరు
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన పాల రమేష్ కూతురు మల్లిక (24) హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా గుత్తి మండలం దేవన ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుదర్శన్ అనే యువకుడితో మల్లికకు వివాహం జరిగింది. దంపతులకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు.
వివాహ సమయంలో మల్లిక తల్లిదండ్రులు తమ శక్తి మేరకు పెళ్లి ఘనంగా నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రారంభంలో దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పటికీ, గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు తలెత్తినట్లు భర్త అత్తమామలు ఆడపడుచులు వేధిస్తున్నట్లు మల్లిక తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తెను మానసికంగా వేధించడం వల్లే ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ దుర్ఘటనకు పాల్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో మల్లిక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హైదరాబాదుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయసులోనే తమ కుమార్తెను కోల్పోయిన దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటపెట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
