కందనవోలు కర్నూలు

తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గం ఆధ్వర్యంలో 44 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కొత్త ఆలోచనలతో నాయకులు, కార్యకర్తలను కలుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండటం అందరి అదృష్టమన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఇలాగే ఎప్పటికీ కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ తెలియకుండా వారానికి ఒకసారి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ఆలోచనా విధానం రాక్షసుల మాదిరి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. మంత్రి నారా లోకేష్ కానీ, తాను కానీ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉంటున్నామన్నారు. అమరావతిని రాజధానిగా శాశ్వతంగా ఉండేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని కదిలించలేరన్నారు.కర్నూలులో కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ యార్డు కమిటీలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన వారికే చోటు దక్కిందన్నారు. ప్రణాళికాబద్దంగా కర్నూలులో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు కొరకంచి రవి, బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, కాపు సంఘం నాయకులు ఆర్జా రామక్రిష్ణ, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు కౌశిక్, పోతురాజు రవికుమార్, సందీప్, సంజీవలక్ష్మి, కాణిపాకం బోర్డు డైరెక్టర్ రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ శేషగిరిశెట్టి, డైరెక్టర్ మారుతీశర్మ, డివిఎంసీ సభ్యులు రాజు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
