కందనవోలు కర్నూలు

దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇది సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఢిల్లీలో బస్ వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్ 2026 కార్యక్రమంలో కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం భారతదేశపు మొత్తం ప్రతిపాదిత పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ 25 శాతానికి పైగా వాటాను కలిగి ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు రవాణాకు ప్రపంచ కేంద్రంగా భారత్ మారుతోందని, ఇందులో ఏపీ కీలకంగా మారనుందన్నారు. 1,000 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం, 6 కార్యాచరణలో ఉన్న ఓడరేవులు ఏపీకి ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే కియా ఇండియా, ఇసుజు మోటార్స్ ఇండియా కంపెనీలు ఏపీలో ఉన్నాయని ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ తయారీ రంగాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఏపీ ఈవీ పాలసీ 4.0 పారిశ్రామికవేత్తలను ఎంతో ఆకర్షిస్తుందన్నారు. మూలధన రాయితీలు, ఎస్సీ,ఎస్టీ రీయింబర్స్‌మెంట్, విద్యుత్ టారిఫ్ ప్రోత్సాహకాలు, 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉందని టీజీ భరత్ చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణకు బస్సుల అవసరం ఎంతో ఉందన్నారు. ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగానికి ఏపీ మద్దతిస్తోందన్నారు.పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలని మంత్రి టీజీ కోరారు.
