కందనవోలు విజయవాడ

విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకూ పనిచేస్తుండటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్ణీత సమయాల్లోనే పనిచేయాల్సి ఉండగా, సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆలస్యంగా తెరిచి ఉండటంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధారణంగా పని దినాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నిర్వహించాలి. అత్యవసర పరిస్థితులు, పెండింగ్ రిజిస్ట్రేషన్లు లేదా సాంకేతిక కారణాలు ఉంటే ఉన్నతాధికారుల అనుమతితో పరిమిత స్థాయిలో అదనపు సమయం పని చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక రికార్డులు, కారణాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, ప్రజలకు సమయపాలన, సిబ్బంది విధుల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. రాత్రి వేళల వరకూ కార్యాలయం కొనసాగితే, ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. “ప్రభుత్వ కార్యాలయాలకు ఒక సమయం ఉంటే, రాత్రివేళల వరకూ కార్యాలయం ఎందుకు కొనసాగుతోంది? అదనపు సమయానికి అధికారిక అనుమతులున్నాయా?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయ పనివేళలు, అదనపు పని నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

You missed