కందనవోలు కర్నూలు

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ సూచించారు.
శనివారం కల్లూరు మండలం 37వ వార్డులోని రెండు ట్యాంకుల సమీపంలో ఉన్న 97వ సచివాలయంలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ స్థాయి అధికారికి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ, బీఎల్‌ఓలు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసి తిరిగి అందజేయాలని కోరారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సందేహాలు ఉంటే తమ ప్రాంత బూత్ స్థాయి అధికారి, తహసీల్దార్ లేదా ఆర్డీఓను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజలందరూ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌ఓలకు సహకరించాలని కోరారు. 2002 నాటి ఓటరు జాబితాలో తమ వివరాలను గుర్తించి, ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలో ఓటరు జాబితాలో పేరు ఉండేలా అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 37వ వార్డు ఇన్‌చార్జి సుతారు రాఘవేంద్ర, సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
