కందనవోలు కర్నూలు

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దిన్నదేవరపాడు డాక్టర్ .బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారని, పెరుగుతున్న జనాభా సమస్యలు, పర్యావరణంపై దాని ప్రభావం, మరియు కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమని,ఐక్యరాజ్యసమితి 1989లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నియంత్రణపై కాకుండా జనాభా నిర్వహణపై చర్చ జరగాలన్నారు.మారుతున్న ప్రపంచంలో సంబంధాలు, తల్లిదండ్రులుగా బాధ్యతలు, మరియు జీవిత లక్ష్యాల విషయంలో యువత యొక్క ఆశయాలను, ఎంపికలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాలన్నారు.జనాభా నిర్వహణ అనేది కేవలం జనాభాను తగ్గించడం మాత్రమే కాదని, ఇది మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం, వనరుల సమతుల్యతను సాధించడం మరియు వృద్ధాప్య సమాజంగా మారకుండా యువశక్తిని కాపాడే ఒక సమగ్ర సామాజిక-ఆర్ధిక వ్యూహమన్నారు.జనాభా అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక, సామాజిక ప్రగతిని నిర్ణయించే అంశమని ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.5గా ఉందని, 1993లో ఇది 3.0గా నమోదైందని వివరించారు. టీఎఫ్ఆర్ వేగంగా తగ్గితే పని చేసే వయస్సులో ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గి, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని తెలిపారు. ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటింది. జనాభా పెరుగుదల ఒకవైపు అభివృద్ధికి సూచికగా ఉన్నప్పటికీ, మరోవైపు నిరుద్యోగం, పేదరికం, పర్యావరణ కాలుష్యం మరియు వనరుల కొరతకు దారితీస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆధునిక ప్రభుత్వాలు జనాభాను నియంత్రించడంతో పాటు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా జనాభాను నిర్వహించే విధానాలను అవలంబిస్తున్నాయన్నారు.2047 నాటికి ఏపీలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనాలు తెలియచేస్తున్నాయి. జనాభా నిర్వహణ అనేది కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతోనే సాధ్యం కాదు. ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. “పిల్లలే సంపద” అనే నినాదంతో పాటు, వారి నాణ్యమైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడే దేశ అభివృద్ధి మరియు సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందని వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నిర్మల మరియు అధ్యాపకులు, సెట్కూరు జూనియర్ అసిస్టెంట్ సంక్రు బాయి పాల్గొన్నారు.
