కందనవోలు కర్నూలు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. ఆదివారం కల్లూరు అర్బన్ పరిధిలోని అబ్బాస్ నగర్, కృష్ణానగర్, న్యూ కృష్ణానగర్, షరీన్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) శిబిరాలను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి శిబిరాల నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… AEROs, BLOలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతం చేసి ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త ఓటరు నమోదులు, పేరు, చిరునామా తదితర సవరణల దరఖాస్తులను సకాలంలో స్వీకరించి త్వరితగతిన పరిశీలించి నిర్ణిత గడువు లోపు సంబధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ASD (Absent, Shifted, Duplicate) పరిశీలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ నమోదులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ధృవీకరించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
