కందనవోలు కర్నూలు

భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆజాద్ జన్మదినం నవంబర్ 11న పురస్కరించుకుని మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు కొనసాగి ఆయన విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల తెచ్చారన్నారు. తద్వారా ఎంతోమంది విద్యార్థుల ఉన్నత విద్యను చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగారన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి, మైనార్టీల సంక్షేమాన్ని ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని, నైపుణ్యంతో కూడిన చదువుల ద్వారానే మానవాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వాలు చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, అందరూ విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చాలా కాలం పనిచేశారని, దేశంలో విద్యాభివృద్ధికి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి క్రిష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివప్రసాద్, డిసిపి వెంకటరమణ, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, సూపరింటెండెంట్ రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

You missed