కందనవోలు పులివెందుల

క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఖాజా మొహిద్దీన్ పిలుపునిచ్చారు. మంగళవారం టిబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల బాకరాపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీబీ డాక్టర్ జిషితతో కలిసి క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ క్షయ ఒక అంటువ్యాధి అని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపారు. మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుందని, ముఖ్యంగా ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు.
రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా టీబీ కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సకాలంలో చికిత్స తీసుకుంటే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. చికిత్స ఆలస్యం చేస్తే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రభుత్వం ద్వారా క్షయ రోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు అపోహలు వీడి వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిపిహెచ్‌వో సుబ్బారెడ్డి, ఎంఫిహెచ్‌ఎస్ సతీష్ కుమార్, టీబీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You missed