కందనవోలు కర్నూలు

మత్తు మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం చేయాలని కర్నూలు వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రియులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ముట్టరని అన్నారు.

డ్రగ్స్ కోసం ఖర్చు చేసే డబ్బు ఉగ్రవాదులు, నక్సలైట్ల చేతికి చేరి దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని, దీనినే నార్కో టెర్రరిజం అంటారని వివరించారు. గ్రంథాలయం జీవితాలను మార్చే జ్ఞాన మందిరమని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ వంటి మహనీయులు గ్రంథాలయాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు.
ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎలీషా మాట్లాడుతూ యువత గ్రంథాలయాలు, క్రీడల వైపు ఆసక్తి పెంచుకుని డ్రగ్స్‌ను తరిమికొట్టాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని కోరారు.
కార్యక్రమంలో ఈగల్ టీమ్ సిబ్బంది, గ్రంథాలయ కార్యదర్శి ప్రకాష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

You missed