కందనవోలు లింగాల

లింగాల మండలంలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించాయి. ముఖ్యంగా ఇప్పట్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాల మరియు లింగాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నమోదైన ఫలితాలు నిరాశకు గురిచేశాయి.ఇప్పట్ల గురుకుల కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఫలితాలు కొంత సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రథమ సంవత్సరం ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ద్వితీయ సంవత్సరంలో 64 మంది విద్యార్థినుల్లో 61 మంది ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరంలో 59 మందిలో కేవలం 16 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మిగతా 37 మంది విద్యార్థినులు ఫెయిల్ కావడం గమనార్హం.గతేడాది ఇదే కళాశాలలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయని, అప్పటి ప్రిన్సిపాల్ సత్యవతమ్మ పదవీ విరమణ అనంతరం పరిస్థితి మారిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికీ రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమించకపోవడం వల్ల కళాశాల నిర్వహణ దెబ్బతిందని ఆరోపిస్తున్నారు.కళాశాలలో కొంతమంది బోధనా సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, పర్యవేక్షణ లేకపోవడంతో నిర్లక్ష్య ధోరణి పెరిగిందని తల్లిదండ్రులు అంటున్నారు. కొందరు ఉపాధ్యాయులు మధ్యాహ్నం 3 గంటలకే వెళ్లిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులకు సరైన బోధన జరగకపోవడమే ఈ ఫలితాలకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం కాంట్రాక్ట్ టీచర్‌ను ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించగా, కళాశాలలో కేవలం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆయన కూడా డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో విద్యా బోధనలో అంతరాయం ఏర్పడుతోందని సమాచారం.మొత్తం 533 మంది విద్యార్థినులు చదువుతున్న ఈ విద్యాసంస్థలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇక లింగాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఈసారి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ద్వితీయ సంవత్సరంలో 77 మంది పరీక్షలు రాయగా 49 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 47 మంది పరీక్షలు రాయగా కేవలం 7 మంది మాత్రమే పాసయ్యారు.ఈ ఫలితాలు కళాశాల చరిత్రలోనే అత్యల్పంగా నమోదయ్యాయని స్థానికులు చెబుతున్నారు. బోధనా లోపాలు, విద్యార్థుల్లో అవగాహన కొరత, పర్యవేక్షణ లోపం వంటి కారణాలు ఇందుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లింగాల మండలంలో ఇంటర్మీడియట్ విద్యా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష చేపట్టి, వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

You missed