కందనవోలు శ్రీశైలం

మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు ( 08.02.2026 నుండి18.02.2026 వరకు) నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు (08.02.2026) ప్రారంభమయ్యాయి.
కాగా ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి.
ఈ ప్రారంభపూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సంబంధిత అధికారులు, స్థానాచార్యులు ( అధ్యాపక), అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి :
ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యుల ( అధ్యాపకులు) వారు లోకక్షేమాన్నికాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.
ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
*పుణ్యాహవచనం :*
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపించబడింది. వృద్ధి మరియు అభ్యుదయాల కోసం ఈ పుణ్యాహవచనం జరిపించబడింది.
*చండీశ్వరపూజ :*
సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ జరిపించబడింది. ఈ బ్రహ్మోత్సవాలు సృష్టికర్తఅయిన బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహించబడుతాయని చెప్పబడుతోంది.
అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరిపించడం సంప్రదాయం.
*కంకణ పూజ, కంకణధారణ*
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. తరువాత కంకణధారణ జరిపించబడింది.
*ఋత్విగ్వరణం :*
కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించబడింది. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించమని ఋత్విక్కులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
*అఖండస్థాపన :*
ఋత్విగ్వరణం తరువాత అఖండదీపస్థాపన చేయబడింది. అనంతరం వాస్తుపూజ చేయబడింది. తరువాత వాస్తు హోమం నిర్వహించబడింది.
రుద్రకలశస్థాపన
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి రుద్ర కలశస్థాపన చేయబడింది. కలశస్థాపన తరువాత కలశార్చన జరిపించబడింది. తరువాత పంచావరణార్చనలు నిర్వహించబడ్డాయి.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపించబడ్డాయి.
అంకురార్పణ
బ్రహ్మోత్సవాల మొదటిరోజు సాయంకాలం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువస్తారు. దీనినే “ మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
*ధ్వజారోహణ :*
బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం జరిగే ఈ ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆలయప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయడమే ఈ *ధ్వజారోహణ.*
ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని చిత్రీకరిస్తారు. దీనికే నంది ధ్వజపటం అని పేరు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన ప్రత్యేక తాడును సిద్ధం చేస్తారు. తరువాత నందిధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమములోనే భేరీపూజ కూడా నిర్వహించబడుతుంది.
ఈ భేరీపూజలో డోలు వాద్యానికి పూజాదికాలు జరుగుతాయి. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో ఆయాదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి, రోజూ పద్ధతి ప్రకారంగా వారికి నివేదన సమర్పిస్తారు. బ్రహ్మోత్సవ సమయములో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.
