కందనవోలు విశాఖపట్నం,
పని ప్రదేశంలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంతో పాటు అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా గాయపడిన 37 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక ఎక్మో చికిత్సతో ప్రాణాలు కాపాడారు. చికిత్సనందించిన ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్. రవి కన్నా వివరాలను వెల్లడించారు.
పని చేస్తున్న ఫ్యాక్టరీలో జరగిన ప్రమాదం తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకురాగా కడుపు భాగం, గ్రోయిన్ మరియు పెరినియం ప్రాంతాల్లో లోతైన రసాయన గాయాలు, రెండు కళ్లలో కార్నియా మబ్బు, కుడి చేతి హ్యూమరస్ ఎముక విరగడం గుర్తించారు. శ్వాసనాళం తీవ్రమైన వాపుతో శ్వాసకోశ వైఫల్యం ఏర్పడటంతో బ్రోంకోస్కోపీ పరీక్షలో గ్రేడ్-3 ఇన్హలేషన్ గాయం ఉన్నట్లు తేలింది. రోగిలో కార్బన్ డైఆక్సడ్ స్థాయిలు పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో వెంటనే వివి ఎక్మో (వీనో-వీనస్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) విధానాన్ని విఎఫ్-విజె కాన్ఫిగరేషన్ద్వారా ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రోగికి తాత్కాలికంగా ఊపిరితిత్తుల పనితీరుకు సహాయపడుతూ శరీరానికి ఆక్సిజన్ అందించారు.
నెబ్యులైజ్డ్ హెపరిన్, స్టెరాయిడ్ చికిత్సతో పాటు శ్వాసనాళాల శుభ్రపరచడం, కాలిన గాయాలకు చికిత్స అందించారు. అలాగే శ్వాసనాళాల్లో పేరుకుపోయిన మలినాలను తొలగించేందుకు తరచుగా బ్రోంకోస్కోపిక్ క్లీనింగ్ నిర్వహించారు. కడుపు కింద భాగం నుండి తోడ, కాలుకి తీవ్రంగా కాలింది. కాలిన గాయాలకు క్రమం తప్పకుండా డ్రెస్‌లు చేయగా, అదృష్టవశాత్తూ చర్మ మార్పిడి శస్త్రచికిత్స అవసరం రాలేదు. రోగి పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో ఐదవ రోజుకే ఎక్మో నుంచి బయటకు తీసి, 15వ రోజున డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రోగి కంటి చూపు కొంతవరకు మెరుగుపడుతోంది అని వైద్యులు తెలిపారు. డా. రవి కన్నా, ఇంటెన్సివిస్ట్ డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో పల్మనాలజిస్ట్ డా. ఫణీంద్ర, ప్లాస్టిక్ సర్జన్ డా. నితీష్ రెడ్డి, ఆఫ్తాల్మాలజిస్ట్ డా. సంధ్యలతో కూడిన బృందం చికిత్స అందించింది.
