కందనవోలు కర్నూలు

 

ఎన్నిక‌ల్లో ఓడినా, గెలిచినా ప్ర‌జాసేవ‌లోనే ఉన్నామ‌ని, ఉంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. త‌న తండ్రి, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా 60 జంట‌ల‌కు ఉచిత వివాహాలు జ‌రిపించారు. మౌర్య ఇన్‌లో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్, కుటుంబ స‌భ్యులు పాల్గొని ఒక్కో జంట‌కు రూ.80వేల చొప్పున‌ చెక్కులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా మాట్లాడుతూ పేద‌వారు పెళ్లిళ్లు చేసుకోవాలంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉంటుంద‌న్నారు. ఈ ఉద్దేశంతోనే త‌న తండ్రి పుట్టిన‌రోజును పుర‌ష్క‌రించుకొని ప్ర‌తి ఏడాది కుల‌, మ‌తాల‌కు అతీతంగా ఉచిత వివాహాలు జ‌రిపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇదివ‌ర‌కే నూత‌న వ‌ధూవ‌రుల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు, కాలి మెట్టెలు, బంగారు తాళిబొట్టు పంపిణీ చేశామ‌న్నారు. నూత‌న వ‌ధూవ‌రులు దుర‌ల‌వాట్ల‌కు బానిస‌లు కాకుండా జీవితంలో పైకి ఎద‌గాల‌ని ఆయ‌న కోరారు. క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు అన్ని రంగాల్లో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం అని చెప్పారు. రాజ‌కీయాల‌కు అతీతంగా సేవ చేస్తున్న‌ట్లు చెప్పారు. త‌ల‌సేమియా రోగుల కోసం రూ.1కోటి విరాళ‌మిచ్చి భ‌వ‌నం నిర్మిస్తున్నామ‌న్నారు. క‌ర్నూలు అభివృద్ధి కోసం టీజీ వెంక‌టేష్ ఎంతో కృషి చేశారని, ఆయ‌న బాట‌లోనే తాను కూడా ప‌య‌నిస్తున్న‌ట్లు చెప్పారు. త‌న తండ్రి చేసిన‌దానికంటే ఎక్కువ‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు. రాజ‌కీయాల ద్వారా డ‌బ్బులు సంపాదించాల‌న్న ఆలోచ‌న త‌మ‌కు లేద‌న్నారు. తాము వ్యాపారాలు చేసుకుంటూ రాజ‌కీయాల్లో ఉన్నామ‌న్నారు. ఏ ఆదాయం లేని వారు రాజ‌కీయాల‌లో ఉండి డ‌బ్బులు దోచుకుంటారన్నారు. తాము మాత్రం క‌ర్నూలు అభివృద్ధి కోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నట్లు చెప్పారు. ప్ర‌జ‌లు ఎవ‌రో చెప్పే పుకార్లు న‌మ్మ‌కండ‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా కోరారు.

You missed