కందనవోలు కర్నూలు
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) సభ్యునిగా ఎన్నికైన డా. శ్రీహరి కురువ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరై తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా డా. శ్రీహరి కురువ మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (HRDA) తరపున పోటీ చేసిన అభ్యర్థులు విశేష విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. కౌన్సిల్‌లో మొత్తం ఎన్నికైన సభ్యులలో హెచ్‌ఆర్‌డీఏ మద్దతుదారులు సుమారు 70 శాతం మెజారిటీ సాధించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు తమ ఓట్ల ద్వారా వ్యక్తపరిచిన ఆశయాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా చైర్మన్, వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ కౌన్సిల్‌లో కీలక పదవుల ఎన్నికల ప్రక్రియలో కొందరు ప్రభావశీల శక్తులు జోక్యం చేసుకొని, మెజారిటీ వైద్యుల అభిప్రాయాలకు భిన్నంగా పరిణామాలు చోటుచేసుకునేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
అయితే, నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు డా. శ్రీహరి కురువ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తి అభివృద్ధి, వైద్యుల హక్కుల పరిరక్షణ, వైద్య వ్యవస్థ బలోపేతం వంటి అంశాల్లో వారు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
హెచ్‌ఆర్‌డీఏ తరఫున ఎన్నికైన సభ్యులకు వివిధ పదవుల ఆశలు చూపించి వారి స్వతంత్ర స్వరాన్ని అణిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అయితే, పదవులు తమకు ప్రధాన లక్ష్యం కాదని, వైద్య మండలి ఆశయాల సాధన, వైద్యుల సమస్యల పరిష్కారం మరియు వైద్య రంగ సంస్కరణలే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందున్న సవాళ్లు ఎంతో కీలకమైనవని, వాటి పరిష్కార దిశగా కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఒకవేళ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే, వైద్యుల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మక ఒత్తిడి తీసుకువచ్చి కౌన్సిల్ ద్వారా వాటిని అమలు చేయించే దిశగా హెచ్‌ఆర్‌డీఏ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్ర వైద్య వ్యవస్థ బలోపేతం, వైద్యుల గౌరవం, పారదర్శక పరిపాలన మరియు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని డా. శ్రీహరి కురువ పేర్కొన్నారు.
