కందనవోలు కర్నూలు
నగరంలోని కూడళ్లపై, డివైడర్లపై, ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించడం, గోడలపై రాతలు వ్రాయడం వంటి చర్యలు నగర సుందరీకరణను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో, డివైడర్ల మధ్య స్తంభాలపై, గోడలపై రాజకీయ పార్టీలు, మత సంస్థలు, ప్రైవేటు సంస్థలు, బ్యానర్లు, సినిమా పోస్టర్లు అతికించడం వల్ల లక్షలాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన సుందరీకరణ పనులు పాడు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు సైతం చట్ట విరుద్ధ చర్యలను అడ్డుకోవాలని కోరారు.ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల వద్ద బ్యానర్లు అడ్డుగా ఉండటం వల్ల ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో విచారణకు అవసరమైన కెమెరా దృశ్యాలు దొరకకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని కమిషనర్ తెలిపారు. నగర సుందరీకరణను కాపాడేందుకు ప్రతి సంస్థ నగరపాలక సంస్థకు సహకరించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. దీనిని ఎవరైనా అతిక్రమించి నగర సుందరీకరణ పనులకు భంగం కలిగిస్తే, మున్సిపల్ కౌన్సిల్ సి.ఆర్.నెం:78 ప్రకారం భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
