కందనవోలు గుంటూరు
అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ రెండవ విడత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేసింది. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ లో ఫామ్ ఆడిటోరియంలో జరిగింది. కోయంబత్తూర్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం – 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చినదాసరిపల్లి లో రచ్చబండ కార్యక్రమం ద్వారా పాల్గొన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్థానిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ అయిందన్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రూ. 53.16 కోట్లు, పి.ఎం. కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ చేయడం జరిగిందని వివరించారు. రైతులు ఎవరి మీద ఆధారపడకుండా సకాలంలో వ్యవసాయ పనులు చేసుకొనుటకు, పెట్టుబడులు పెట్టుటకు దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు. రైతులు ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా కార్యక్రమం నిర్వహణ జరుగుతోందని వివరించారు. వ్యవసాయం లాభదాయకంగా ఉండుటకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. పంట మార్పిడి చేయుటకు ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు నీటి యాజమాన్యం సక్రమంగా చేయాలని తద్వారా మంచి దిగుబడులు సాధించగలమని పేర్కొన్నారు. వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ జిల్లాలో ఆధునిక వ్యవసాయ పనిముట్లను రూ.5.69 కోట్లతో అందించడం జరిగిందని, ఇందులో రూ.2 కోట్ల వరకు రాయితీ ఉందని చెప్పారు. మొంథా తుఫాన్లో జిల్లాలో 2 వేల హెక్టార్ల వరకు పంట నష్టం జరిగిందని, ఇందుకుగాను పెట్టుబడి నష్టం రూ.4.14 కోట్లుగా ఉందని ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. రైతులకు 1.53 లక్షల టన్నుల ఎరువులు ఖరీఫ్ లో పంపిణీ చేశామని, రబీ సీజన్లో కూడా ఎటువంటి ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రత్తిపాడు శాసన సభ్యులు డా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పి.ఎం కిసాన్ పథకం రెండవ విడతగా రాష్ట్రంలో 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ జరిగిందన్నారు. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసిందన్నారు. రెండవ విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు ఉన్నాయని చెప్పారు. పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో 30,428 మంది రైతులకు రూ.20.07 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నానన్నారు. మొంధా తుఫాను సమయంలో జిల్లా కలెక్టర్ చేపట్టిన ముందస్తు చర్యలను అభినందిస్తున్నానన్నారు.
అనంతరం జిల్లాలో 1,06,329 మంది రైతులకు పెట్టుబడి సాయం క్రింద రూ.70,00,67,000/-ల చెక్కును అందించడం జరిగింది. రైతులకు విత్తనాలను అందించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అంగ్రూ వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మీ దేవి , డైరెక్టర్ జి. శివన్నారాయణ, రాష్ట్ర మాదిగ వెల్ఫేర్, కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి , హజ్ కమిటీ ఛైర్మన్ భాష , జెడ్ పి సీఈఓ జ్యోతిబసు , వ్యవసాయ శాఖ జేడీఏ నాగేశ్వర రావు , అంగ్రూ ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీలత , విశ్వ విద్యాలయ అధికారులు , విద్యార్దులు , రైతులు పాల్గొన్నారు.
