కందనవోలు గుంటూరు

సత్య సాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌జ‌యంతి ఉత్స‌వాన్ని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సత్య సాయి సేవా సమితి సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎపి టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మండవ మోహన కృష్ణ పాల్గొని సత్య సాయి చిత్ర పటానికి జ్యోతి ప్రజ్వలన, పూలమాలంకరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్య సాయి సమాజానికి దిక్సూచి అన్నారు. సత్య సాయి స్పూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాలతో పాటు, తాగు నీటి ప్రాజెక్టులు దాహార్తిని తీర్చుతూ సమాజానికి ఎంతో ప్రయోజనం పొందడం జరుగుతుందని అన్నారు. బాబా స్వయంగా పాటించి, ఆచరించి చూపారని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పారు. పిల్లలకు సత్య సాయి బోధనలు ఎంతగానో తోడ్పడతాయని, తల్లిదండ్రులు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని సూచించారు. ప్రజలతో ప్రేమగా, ఆప్యాయతతో మాట్లాడటంకు బాబాను అనుసరించాలని అన్నారు. స్వయం సంకల్పం తీసుకోవాలని కోరారు. బాబా ఎనలేని మానవతా విలువలు బోధించారని అన్నారు. ప్రేమ, సత్యం, అహింస, ధర్మం, శాంతి ప్రతి మనిషి పరమార్థం అని భగవాన్ సత్య సాయి బోధనలు అపురూపమని చెప్పారు.ఎపి టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మండవ మోహన కృష్ణ మాట్లాడుతూ ప్రేమ తత్వమే సేవా తత్వంగా బాబా భావించారన్నారు. అనేక రకాలుగా సమాజంలో పరివర్తన కల్పించారని పేర్కొన్నారు.గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి  శ్రీనివాసులు మాట్లాడుతూ సత్య సాయి ప్రపంచానికి గొప్ప వరం అన్నారు. సమాజానికి నైతిక విలువలు నేర్పిన వ్యక్తి అన్నారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ సత్య సాయి ‘ డివైన్ సోల్ ‘ అన్నారు. సత్య సాయి స్థాపించిన ప్రాజెక్ట్స్ వలన సమాజం ఎంతో ప్రయోజనం పొందుతుందని చెప్పారు. సత్య సాయి అడుగుజాడల్లో నడవాలి, గొప్ప సమాజాన్ని స్థాపించాలని కోరారు.సత్య సాయి సేవా సమితి అధ్యక్షులు నరసింహ రాజు మాట్లాడుతూ చిన్న పనిని గొప్పగా చేయాలని సూచించారని చెప్పారు. ఏదైనా మన మంచికే అనుకోవాలని భగవాన్ సూచించారని తెలిపారు. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలని స్వామి చెప్పారని తెలిపారు. పంచేంద్రియాలనూ నియంత్రించాలని, ధర్మార్థ కామ మోక్షాలను జయించాలని సూచించారని తెలిపారు.సత్య సాయి సేవా సమితి సభ్యులుసాయి శంకర్ మాట్లాడుతూ మనిషిగా పుట్టి మహనీయుడు అయ్యారన్నారు. నీ ధర్మాన్ని నీవు పాటించు అని సూచించారని తెలిపారు. సమాజానికి సత్య సాయి బోధనలు శిరోధార్యం అన్నారు. మానవతా ధర్మం, నిజాయితీ వంటి గొప్ప బోధనలు చేశారని చెప్పారు. బాబా మాతృ మాటను శిరోధార్యంగా భావించారని తెలిపారు. తల్లి కోరిక మేరకు ఆసుపత్రిని, విద్యా సంస్థలను నిర్మించారని చెప్పారు. సత్య సాయి బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి గుణాత్మక విద్యకు ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. ప్రేమ, సేవా పదాలే పరమార్థాలుగా భావించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి,  జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ,డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్, సత్య సాయి సేవా సమితి సభ్యులు పి.వి.ఎస్ రాజు, మహంకాళి శ్రీనివాస్, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You missed