కందనవోలు విశాఖపట్నం,
పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గ్రహణం మొర్రి సమస్యను చిన్నతనంలోనే శస్త్రచికిత్సతో నయం చేయించాలి. లేకపోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది. గ్రహణం మొర్రికి ముందుగానే శస్త్రచికిత్స చేస్తే.. వాళ్లు అందరిలాగే తినడం, మాట్లాడడం సాధ్యమవుతుంది. లేకపోతే సమాజంలో వాళ్లు అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ప్రముఖ దంత వైద్య నిపుణుడు, మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో 2004 నుంచి ఇప్పటివరకు 3వేలకు పైగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మా ఆస్పత్రిలో గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలతో పాటు.. ముఖంలో ఉండే అవకరాలనూ శస్త్రచికిత్సలతో నయం చేస్తున్నాం. గ్రహణం మొర్రి అనేది పుట్టుకతోనే వచ్చే సమస్య. ఇప్పటికి మా ఆస్పత్రిలో 15 రోజుల వయసున్న పిల్లల నుంచి 66 ఏళ్ల వయసున్న పెద్దల వరకు అన్ని వయసుల వారికీ ఈ శస్త్రచికిత్సలు చేశాం. అయితే, చిన్న వయసులోనే చేయిస్తే.. వాళ్లలో ఆత్మన్యూనత భావం తగ్గుతుంది. అమెరికాకు చెందిన దోషి స్మైల్స్ సంస్థ వైద్యులు డాక్టర్ నితిన్ దోషి, డాక్టర్ లీనా దోషి స్థాపించిన ఇంగా ఫౌండేషన్ ద్వారా కిమ్స్ ఐకాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి బలరామ్ ఈ మొత్తం కార్యక్రమానికి అండదండలు అందించారు. ఈ బ్యానర్ కింద గడిచిన శస్త్రచికిత్సలను పేదలకు పూర్తి ఉచితంగా చేశాం. వారి ఇంటి నుంచి ఆస్పత్రికి, మళ్లీ తిరిగి ఆస్పత్రి నుంచి ఇంటికి రవాణా సౌకర్యం కూడా మేమే కల్పించాం’’ అని డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంగా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, మెడికల్ డైరెక్టర్ర డాక్టర్ కృష్ణ శ్యామారావు, ఇంగా ఫౌండేషన్ ట్రస్టీ డాక్టర్ చేతన్ కుమార్, అసోసియేషన్ ఆఫ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఓఎంఎస్ఐ) అధ్యక్షుడు డాక్టర్ ఆర్. మణికందన్, ఏఓఎంఎస్ఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ పి. వసుంధర్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ రాజు, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ మమతా దేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
