కందనవోలు గుంటూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ బి. సత్య యేసు బాబు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ లతో కలిసి ఆదివారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పోలీస్ నియామకం చేపట్టడం అందులో ఎంపికైన ఆరు వేల ఒక వంద మంది అభ్యర్థులకు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో 16వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణంలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరిశోధ్య లోపం లేకుండా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగు నీటి ఏర్పాట్లు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో నాలుగు అంబులెన్సులు, సరిపడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వాహనాలకు, వచ్చే బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. నియామక పత్రాలు స్వీకరించుటకు వచ్చే అభ్యర్థులను ఎయిమ్స్ బ్లాక్ వన్, టు ఎదురుగా ఉన్న గేట్ గుండా సభ వేదిక వద్దకు ప్రవేశ మార్గం కల్పించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, ఎస్.ఎస్.జి అదనపు సంచాలకులు మల్లిఖార్జున, అదనపు ఎస్పీలు హనుమంతు, రమణ మూర్తి,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, వైద్య ఆరోగ్య శాఖ అధికారి సునీత, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You missed