కందనవోలు విజయవాడ
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండు సంవత్సరాల (2026, 2027) కాలపరిమితికి సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేసే నూతన అక్రిడిటేషన్ లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 రెండు సంవత్సరాలకు జారీ చేసే అక్రిడిటేషన్స్ కు నిబంధనల మేరకు అర్హత కలిగిన పాత్రికేయుల దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారన్నారు. గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ముగుస్తున్నందున నూతన అక్రిడిటేషన్స్ జారీ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. దరఖాస్తుల నమోదుకు ముందుగా మీడియా సంస్థల వివరాలు పోర్టల్ లో పొందుపరచవలసి ఉన్నందున సంబంధిత పత్రాల డాక్యుమెంట్లను పెన్ డ్రైవ్ లో పొందుపరిచి మరియు జిరాక్స్ కాపీలను సమాచార, పౌర సంబంధాల శాఖ, పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, రెండవ అంతస్థులోని విజయవాడ కార్యాలయంలో అందజేయాలన్నారు. అనంతరం పాత్రికేయులు నవంబర్ 14 వ తేదీ నుండి ఆన్ లైన్ వెబ్ సైట్ https://mediarelations.ap.gov.in లో సూచించిన విధంగా సంబంధిత పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ ఆ ప్రకటనలో తెలియజేశారు.
