కందనవోలు కర్నూలు,
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ, కర్నూలు కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని పాత్రికేయుల కోసం ఒక మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. జోహరాపురం రోడ్డులోని కిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరంలో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ కురుకుందు నేతృత్వంలో కార్డియాలజీ విభాగానికి చెందిన పలువురు వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొని, పాత్రికేయులందరికీ ఉచితంగా పలు పరీక్షలు చేశారు. వాటిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, సీరం క్రియాటినైన్, 2డి ఎకో, జీఆర్‌బీఎస్, లిపిడ్ ప్రొఫైల్ తదితర పరీక్షలున్నాయి. ఇవి చేసిన తర్వాత ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్ కూడా అందించారు. ఈ పరీక్షల్లో ఏమైనా ఫలితాలు తేడాగా వస్తే, గుండె వ్యాధులను నిర్ధారించేందుకు అవసరమయ్యే అదనపు పరీక్షలు అన్నింటిపైనా 50% రాయితీ కూడా ప్రకటించారు. గుండెపోటు, లేదా ఇతర గుండె సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఏమున్నాయో ముందుగానే గుర్తించి, పాత్రికేయులను అప్రమత్తం చేయడం ఈ శిబిరం ప్రధానోద్దేశం. నిరంతరం మానసిక మరియు శారీరక ఒత్తిడిలో ఉండే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోవాలని, ఎప్పటికప్పుడు ఇలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యముగా ఉండాలని కర్నూలు కిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, సీఓఓ డాక్టర్ సునీల్ శేపూరి, జనరల్ మేనేజర్ ఆనంద్ తదితరులు అభిలషించారు.
అంతేకాకుండా భవిష్యత్తులో పాత్రికేయుల కుటుంబసభ్యులకు సైతం వారి వయసు ఆధారిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తామని తెలిపారు.
