కందనవోలు నంద్యాల

నంద్యాల పట్టణం సంజీవనగర్‌లోని సత్య సాయి కళ్యాణమండపంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు భగవాన్ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ సత్య సాయి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. “భగవాన్ సత్య సాయి బాబా బోధనలు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చేరాయన్నారు. ప్రతి కుటుంబంలో ఆయన ప్రార్థనలు వినిపిస్తున్నాయంటే, ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ఎంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు,” అని అన్నారు. విద్య, వైద్యం, తాగునీటి సరఫరా వంటి రంగాల్లో సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న సేవలు లక్షలాది ప్రజలకు జీవితాంతం నిలిచే వరమని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీటి కొరత ఉన్న అనేక జిల్లాల్లో సత్య సాయి సిపిడబ్ల్యూ (CPW) పథకాలు అమలు చేయడం ద్వారా బాబా సేవలు ప్రజలకు చేరువయ్యాయని వివరించారు.కేజీ నుంచి ఉన్నత విద్య వరకు విలువల ఆధారిత విద్యను ఉచితంగా అందిస్తూ, విద్యార్థులను సమాజ సేవకు సిద్ధం చేసే వ్యక్తిత్వ వికాసం సత్య సాయి ఆశ్రమం ప్రత్యేకత,” అని కలెక్టర్ అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తూ, వారికి స్ఫూర్తిదాయకంగా ఉండటం బాబా బోధనల మహత్తు అని అన్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ప్రసిద్ధిగాంచిన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడం బాబా కరుణా భావానికి ప్రతీక అని కలెక్టర్ పేర్కొన్నారు. “ఇలాంటి సేవా తత్పరత మనందరిలో పెరిగి, సమాజం పట్ల బాధ్యతతో సేవ చేయాలనే స్పూర్తి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను,” అని కలెక్టర్ తెలిపారు అనంతరం సత్య సాయి శత జయంతి సందర్భంగా ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లు, ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు

You missed