కందనవోలు ఎన్టీఆర్ జిల్లా

అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్పేస్ ఆన్ వీల్స్ ను కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్స్ విజయవంతంగా ముందుకు సాగుతోందని.. నగర విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు ఈ ప్రదర్శనను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. భారతదేశ తొలి ఉపగ్రహ వాహక నౌక నుంచి తాజాగా ఇస్రో ప్రయోగాల వరకు, లాంచ్ప్యాడ్లు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా ప్రదర్శనలు ఉన్నాయన్నారు. వివిధ నమూనాలను చూడటం, వాటి విషయాలను తెలుసుకోవడం ద్వారా అంతరిక్ష విజ్ఞాన వికాసానికి వీలవుతుందన్నారు. సంక్లిష్టమైన అంతరిక్ష సాంకేతికతను వివరించడంతో పాటు అంతరిక్ష రంగంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కార్యక్రమంలో షార్ టెక్నికల్ అధికారి కిరణ్ పాల్గొన్నారు. స్పేస్ ఆన్ వీల్స్ సందర్శనకు వస్తున్న విద్యార్థులకు కిరణ్.. భారత అంతరిక్ష విజయయాత్ర గురించి క్షుణ్నంగా వివరిస్తున్నారు.

You missed