కందనవోలు కర్నూలు
కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా షాపులు తొలగించిన ప్రాంతంలో నూతనంగా రోడ్డును వేశారు. ఈ రోడ్డును మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు జగదీష్ గుప్త, మనోజ్, కౌశిక్, మాజీ కార్పొరేటర్లు అబ్బాస్, రామాంజనేయులు, పామన్న, జనసేన నాయకులు అర్షద్, టిడిపి మైనారిటీ సిటీ ప్రెసిడెంట్ హమీద్, మసీదు కమిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రారంభమై ఉండింటే పలువురు ప్రాణాలు కోల్పోయేవారు కాదన్నారు. ఇప్పుడు ఇందుకు సహకరించిన మసీదు కమిటీకి, అధికారులకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దీంతో పాటు కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందన్నారు. ఇక ఏ,బీ,సీ క్యాంపు క్వార్టర్లలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా నగరంలోనే హైకోర్టు బెంచ్ ఉండేలా చూడాలని గతంలో చెప్పారని మంత్రి తెలిపారు. తమది మంచి ప్రభుత్వమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తామన్నారు. ఇక్కడ షాపులు కోల్పోయిన వారికి ఇదివరకు ఎం.ఓయూ చేసుకున్న విధంగా ముందుకు వెళతామన్నారు.
