కందనవోలు కర్నూలు
కర్నూల్లో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని గడియారం ఆస్పత్రి సమీపంలోని ప్రీమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ ఉర్దూ హాస్టల్స్‌కు మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ఆధ్వర్యంలో 2 ఫ్రిడ్జ్‌లు, 10 కుర్చీలు, 30 ప్లేట్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీకి ఉన్న నిధులతో ముస్లింలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు రూ.3వేలు ఇస్తున్నారన్నారు. వక్ఫ్ కాంప్లెక్స్‌ల ఆవరణలో నిర్మాణ దశలో ఉన్న ఫంక్షన్ హాల్ ను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల డబ్బు దుర్వినియోగం అవ్వకుండా మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజాన్లకు రూ.5వేలు ఇస్తున్నట్లు చెప్పారు. తమది మంచి ప్రభుత్వమన్నారు. ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణం గత ప్రభుత్వంలో ముందుకు సాగలేదన్నారు. ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణం కోసం తన తరుపున కోటి రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు చదువుపై శ్రద్ద పెట్టాలన్నారు. తమ ప్రభుత్వంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేశామన్నారు. చదువు పూర్తైన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఏదైనా ప్రాజెక్టుతో ముందుకు వస్తే వాళ్లకు అన్నివిధాలా సహకారం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జామియా మసీదుకు రెండు ఫ్రీజర్ బాక్సులను మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ప్రతినిధులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సయ్యదా సబిహా పర్వీన్, కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ ఆలీ ఖాన్, టిడిపి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, టిడిపి మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు హమీద్, కేర్ టేకర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మహబూబ్, ప్రధాన కార్యదర్శి రబ్బాని, ట్రెజరర్ రమీజ్, సబ్యులు మునాఫ్, సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు.
