కందనవోలు కర్నూలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన విధంగా పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రిని.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిశారు. పారిశ్రామిక లాజిస్టిక్‌లను బలోపేతం చేయడానికి మరియు రాష్ట్ర ప్రధాన పారిశ్రామిక పార్కుల పోటీతత్వాన్ని పెంచడానికి ఓర్వకల్ మరియు శ్రీ సిటీ వద్ద రైల్వే సైడింగ్‌ల విషయంపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు టీజీ భరత్ పేర్కొన్నారు. అంతేకాకుండా కర్నూలు నుండి విజయవాడకు కొత్త రైలు సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు మరియు వ్యాపార వర్గాలకు రైలు సౌకర్యం ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయనకు వివరించినట్లు తెలిపారు. దీనిపై కర్నూలు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ విషయంపై కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
