కందనవోలు విజయవాడ:

చిన్న, మధ్య తరహా పత్రికలకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఎస్. రంగశాయి నాయకత్వంలో అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఐ అండ్ పీఆర్ డైరెక్టరును సమాచార శాఖ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు సంబంధించిన పలు సమస్యలను ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు డైరెక్టరుకు వివరించారు. పీఆర్జీఐ ఆన్లైన్ సర్టిఫికెట్లను, పాత పత్రికల విషయంలో ఆర్ఎన్ఐ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ అంశంపై అవసరమైన ఆదేశాలిస్తానని డైరెక్టర్ విశ్వనాథన్ తెలిపారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న ఎంప్యానల్మెంట్ ఫైళ్లను సత్వరమే క్లియర్ చేయాలని, ఆర్జేడీల స్థాయిలో పరిశీలనలో ఉన్న ఎంప్యానల్మెంట్ ఫైళ్లను క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా.. రెండు వారాల్లోగా పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. నాన్ ఎంప్యానల్డ్ పత్రికల జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలన్న అసోసియేషన్ ప్రతిపాదనపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. యాన్యువల్ రిటర్న్స్ తో నమోదు చేయించిన సీఏ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాలని, అక్రిడిటేషన్ జీవోలో 4-8 పేజీల కేటగిరీని రెండు విభాగాలుగా విభజించాలని, ఉమ్మడి జిల్లాల్లో అక్రిడిటేషన్లు ఇచ్చేలా మెమో జారీ చేయాలని అసోసియేషన్ నేతలు డైరెక్టరుకు విన్నవించారు. ఎడ్వర్టైజ్మెంట్ రేట్ కార్డును రివైజ్ చేసి, రేట్లు పెంచాలని కోరారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తెలియజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, రాజధాని ఖాన్, రేపటి కోసం శ్రీనివాస్, సత్యాగ్రహం శ్రీనివాస్, ముప్పిరిశెట్టి జగదీష్, ఉదయ అక్షరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

You missed