కందనవోలు కర్నూలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక ప్రధాన నియోజకవర్గంలో భార్య, భర్త, కూతురు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలే అవుతున్నారని, కూతురు హైదరాబాద్‌లో కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని.. ఇదేం వ్యవహారమని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. కర్నూలు జిల్లాపరిషత్ సమావేశమందిరంలో ఆదివారం నిర్వహించిన ఓబీసీ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒక నియోజకవర్గం అంతా వాళ్లకు రాసి ఇచ్చేసినట్లు భావిస్తున్నారని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మాకు మీ ఆరు గ్యారంటీలు, మూడు గ్యారంటీలు అక్కర్లేదు, నగదు బదిలీ పథకాలూ అక్కర్లేదు. మేం ఇళ్లెలా కట్టుకుంటున్నామో, ఈ రాజ్యాన్ని కూడా అలాగే కట్టుకుంటాం. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వండి. ఇప్పటివరకు బోయలు కేవలం 17 మందే ఎమ్మెల్యేలయ్యారు. నిజానికి 91 మంది వరకు అవ్వాలి. దాని ఆధారంగా మనం ప్రశ్నించాలి. రెడ్లు వచ్చి ఇక్కడ పోటీచేసేదేంటి, మా బోయలు నిలబడతారని చెప్పగలగాలి. ఇన్నాళ్లూ చేసింది చాలు.. మేం ఏలుకుంటే మాకు కావల్సిన పనులు మేమే చేసుకుంటాం. గౌడ్‌లు, మత్స్యకారులు, కురుబలు ఇలా వివిధ కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం అత్యంత దారుణంగా ఉంది. సాధారణంగా యాదవులు, గౌడ్‌ల మీద బీసీలలోనే కొంత అసూయ ఉంటుంది. కానీ, రెడ్లు 4.82 శాతం ఉంటే 658 మంది ఎమ్మెల్యేలయ్యారు. కానీ రెడ్ల కంటే ఎంతో ఎక్కువగా ఉన్న యాదవులు కేవలం 24 మందే ఇప్పటివరకు ఎమ్మెల్యేలయ్యారు. అంటే ఈ యాదవుల సీట్లు కొట్టేసింది రెడ్లే. కేంద్రంలో అధికారంలో ఉండేది.. అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉండేది బాబు లేదంటే జగన్. ఏంటిది? అసలు పార్టీలు మన శత్రువులు కారు.. కుల నాయకులే మన శత్రువులు. మన రాష్ట్రంలో కులాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది కమ్యూనిజం, సోషలిజం కాదు.. కాస్టిజమే ఉంటోంది. అసలు ఎమ్మెల్యే అన్నవాళ్లే రాజ్యాధికారానికి పవర్ యూనిట్ అవుతారు. బరువుకు గ్రాములు, శక్తికి జౌల్స్ ఎలాగో రాజ్యాధికారానికి ఎమ్మెల్యే అలా అన్నమాట. కానీ, ఈ ఎమ్మెల్యేలుగా ఎక్కువమంది రెడ్లు, కమ్మవాళ్లే అవుతున్నారు. ఈరోజు ఎమ్మెల్యే ఒక పార్టీలో ఉంటాడు. రేపు వేరే పార్టీ గెలుస్తుందనుకుంటే అందులోకి వెళ్లిపోతున్నాడు. అక్కడా ఆయనే ఎమ్మెల్యే అవుతున్నాడు’’ అని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో బామ్‌సెఫ్ జాతీయాధ్యక్షుడు వామన్ మేశ్రం, రాష్ట్రీయ పిఛ్‌డా వర్గ్ మోర్చా జాతీయాధ్యక్షుడు చౌదరి వికాస్ పటేల్, కర్నూలు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ సింగారి, డిప్యూటీ కలెక్టర్ దొమ్మర నాగమ్మ, నంద్యాల వైద్య కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్‌మోహన్, రిటైర్డ్ డీఈఓ శంకర్ గౌడ్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కురువ శివప్రసాద్ తదితరులు పాల్గొని బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
