కందనవోలు కర్నూలు
భారత రాజ్యాంగం సమానత్వం, మత స్వేచ్ఛను హామీ ఇస్తున్నప్పటికీ, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా షెడ్యూల్డ్ కాస్టుల (SC) హక్కులను మత ఆధారంగా పరిమితం చేయడం తీవ్రమైన అన్యాయమని క్రైస్తవ మైనారిటీ హక్కుల పరిరక్షణ నేత ఎస్. జయకాంత్ క్రిస్టియన్ విమర్శించారు.
1950 ఆగస్టు 10న అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం, హిందూ మతాన్ని అనుసరించే వారికి మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందని, క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరించిన ఎస్సీలకు ఆ హోదా రద్దు అవుతుందని పేర్కొనడాన్ని ఆయన “కుట్రపూరితమైన కలం పోటు”గా అభివర్ణించారు.
కులం అనేది ఒక సామాజిక నిర్మాణమని, మతం మారినంత మాత్రాన కుల ఆధారిత వివక్ష, అవమానం, వెనుకబాటుతనం అంతరించిపోవని ఆయన స్పష్టం చేశారు. కులానికి మతానికి ప్రత్యక్ష సంబంధం లేదని, అయినప్పటికీ ఎస్సీల విషయంలో మాత్రమే మతాన్ని అడ్డంకిగా చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
బీసీలు, ఓసీలలో మతం మారినప్పటికీ వారి సామాజిక స్థితి లేదా రిజర్వేషన్ హక్కులపై ప్రభావం ఉండదని, కానీ ఎస్సీలకు మాత్రమే ఈ విధమైన శిక్ష విధించడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని ఆయన ప్రశ్నించారు. ఇది సామాజిక న్యాయంపై నేరుగా దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 15 (వివక్ష రాహిత్యం), ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ)లు ప్రతి పౌరునికీ వర్తిస్తాయని గుర్తు చేస్తూ, ఎస్సీలు మతం మారినందుకు వారి హక్కులు కోల్పోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
ఎస్సీలు మతం మారడం అనేది అంటరానితనం, విద్యా అవకాశాల లోపం, సామాజిక దౌర్జన్యాల నుంచి విముక్తి పొందాలనే ప్రయత్నమని, అలాంటి మార్పుకు శిక్ష విధించడం నైతికంగా కూడా తప్పేనని అన్నారు.
చివరిగా, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తక్షణమే రద్దు చేసి, ఎస్సీలకు మతానికి అతీతంగా పూర్తిస్థాయి రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటం ఏ మతానికి లేదా వర్గానికి వ్యతిరేకం కాదని, అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయాన్ని సాధించడానికేనని స్పష్టం చేశారు.
