కందనవోలు కర్నూలు

విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ పంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి కుమార్ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆయన్ను అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు తమ ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాజాగా 2019-2024 మధ్య కాలానికి సంబంధించి రూ.4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసిందని… అయితే ఈ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరించేలా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను నాయకులు ప్రజలందరికీ వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
నేను రాజకీయాలు చేస్తే వారికే ఇబ్బంది..
ఇక మంత్రిగా తాను ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టి రాజకీయాలు చేయడం లేదని, తన ఆలోచన అంతా కర్నూలు అభివృద్ధి పైనే ఉందన్నారు. కావాలని తనను టార్గెట్ చేయొద్ద్ననారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి తప్ప.. తన నియోజకవర్గంలో వచ్చి రాజకీయాలు చేస్తే బాగుండదన్నారు. తాను రాజకీయాలు చేయాలనుకుంటే వారికే ఇబ్బందన్నారు. ఇక అదిష్టానానికి తాను ఏంటో తెలుసన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తాను మంత్రిగానే ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్, సీనియర్ నాయకులు ఆకేపోగు ప్రభాకర్, కార్పొరేటర్లు పరమేష్, కైపా పద్మలత రెడ్డి, తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, తదితర సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జిలు, పాల్గొన్నారు.
