కందనవోలు కర్నూలు

 

అలీప్ సంస్థ ద్వారా వేలాది మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌రత్ అన్నారు. ఓర్వ‌క‌ల్లులో అలీప్ ( అసోసియేష‌న్ ఆఫ్ లేడీ ఎంట్రెప్య్రూన‌ర్స్ ఆఫ్ ఇండియా) ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ లే అవుట్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అలీప్ సంస్థ కింద హైద‌రాబాద్‌లో 10 వేల మంది మ‌హిళ‌లు ఉద్యోగాలు చేస్తున్నార‌న్నారు. వీరితో మాట్లాడి ఓర్వ‌క‌ల్లుకు తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. ఓర్వ‌క‌ల్లులో 30 ఎక‌రాల స్థ‌లం వీరికి కేటాయించామ‌న్నారు. వీరి ద్వారా వేలాది మంది మ‌హిళ‌ల‌కు ఉపాధి అవకాశాలు ల‌బిస్తాయని.. అందుకే సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎక‌రం రూ.10 ల‌క్ష‌ల‌కు కేటాయించార‌న్నారు. ఇప్ప‌టికే 25 సంస్థ‌లు ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం శుభ ప‌రిణామం అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఓర్వ‌క‌ల్లులో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాలేద‌ని, ఉన్న జైరాజ్ ఇస్పాత్ ప‌రిశ్ర‌మ‌కు సైతం ఎన్నో ఇబ్బందులు పెట్టార‌న్నారు. ఓర్వ‌క‌ల్లుకు ఇప్ప‌టికే రూ.10వేల కోట్ల పెట్టుబడులు వ‌చ్చాయ‌ని, సెమీ కండెక్ట‌ర్ పాల‌సీ 2.0 విడుద‌లైన త‌ర్వాత ఇక్క‌డ సెమీకండెక్ట‌ర్ రంగంలో పెట్టుబ‌డులు వ‌స్తాయ‌న్నారు. డిఫెన్స్, స్పేస్, కెమిక‌ల్ ప్రాజెక్టులు ఓర్వ‌క‌ల్లుకు వ‌స్తాయ‌న్నారు. ఇప్ప‌టికే రిల‌య‌న్స్ కంపెనీ కూడా ప‌నులు ప్రారంభించింద‌ని తెలిపారు. ఉద్యోగాల‌కు త‌గ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. స్థానికంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న కంపెనీల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు చాలా అవ‌స‌ర‌మ‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అలీప్ వైస్ ప్రెసిడెంట్ స్వ‌రూప‌, సెక్ర‌ట‌రీ ప‌ద్మ‌జ‌, వైస్ ప్రెసిడెంట్ ల్యాండ్స్ శ్రీదేవి, రాష్ట్ర‌ పొదుపు సంఘాల స‌ల‌హాదారు విజ‌య‌ల‌క్ష్మి, క‌ర్నూల్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు విజ‌య్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

You missed