కందనవోలు న్యూస్

కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. కార్యాలయంలో రైటర్ల ద్వారా జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అర్థగేరి గ్రామానికి చెందిన సీతాపతి అనే వ్యక్తి ఫిర్యాదు ప్రకారం, సర్వే నెంబర్ 252లోని 2 ఎకరాల భూమిని చలవప్ప అనే వ్యక్తి తన వద్ద తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. అయితే అదే భూమిని తరువాత తన భార్య లక్ష్మి పేరిట మరోసారి రిజిస్ట్రేషన్ చేయించడంతో తాను మోసపోయినట్లు బాధితుడు వాపోతున్నారు.
ఈ అంశంపై ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆశ్రయించగా, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ మల్లికార్జున సరైన స్పందన ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రాథమిక తనిఖీలు, రికార్డుల పరిశీలన చేయాల్సిన అధికారులు తమ బాధ్యతను విస్మరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్లు జరగడం భూ లావాదేవీలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంతో పాటు, కార్యాలయాల్లో కొనసాగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
