కందనవోలు కర్నూలు

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ధర్మపేట, పెద్దపడఖానా, బుధవారపేట, జొహరాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గులు, క్రికెట్ పోటీల విజేతలకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన సంప్రదాయాలు మరిచిపోకుండా కొనసాగించాలన్నారు. ఆర్థిక సమస్యలున్నా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై, కర్నూల్లో తనపై దీవెనలు ఎప్పటికీ ఉండాలని ఆయన ప్రజలను కోరారు. కర్నూలు నగరంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కొందరు నాయకులు వారు ఓడిపోయిన వార్డుల్లో అభివృద్ధి పనులు చేయలేదని, తాము అలా కాకుండా అన్ని వార్డుల్లో ప్రజల కోరిక మేరకు పనులు చేస్తున్నామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంబాలు, త్రాగునీటి సమస్యలు తీర్చుతున్నామన్నారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నామన్నారు. అర్హులకు ఇల్లు, ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, మరో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. డ్రోన్ సిటీని కర్నూలులో పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని.. దీని ద్వారా ఎన్నో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. మంచి చేసేది ఎవరో ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పరమేష్, జకియా అక్సారి, బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, టిడిపి కర్నూలు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ సోమిశెట్టి శ్రీకాంత్, సీనియర్ నాయకులు అబ్బాస్, నౌషద్, రామాంజనేయులు, పామన్న, రమేష్, ఏపీఐఐసీ డైరెక్టర్ కౌశిక్, ఏపీఐడీసీఎల్ డైరెక్టర్ భీమిశెట్టి మనోజ్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్, ఆనంద్, కస్తూరి వెంకటేశ్వర్లు, చంద్రమోహన్, సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.
