కందనవోలు వై.ఎస్.ఆర్ కడప
దేశ తొలి విద్యా మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య మంగళవారం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి మాట్లాడుతూ మౌలానా ఆజాద్ జయంతిని దేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు “మొహియుద్దీన్ అహ్మద్”, ‘అబుల్ కలాం’ అనేది అతని బిరుదు, ‘ఆజాద్’ అనేది కలం పేరు. ఆయన ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడని వివరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్య్ర సమర ఘట్టంలో ముఖ్య నాయకులలో ఒకరని, దేశ స్వాతంత్రం కొరకు అనేక మార్లు జైలుకు వెళ్లారని, హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించటానికి విశేష కృషిచేసిన ఆ మహనీయున్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏ.ఆర్ అదనపు ఎస్.పి సూచించారు. కార్యక్రమంలో ఆర్.ఐ లు శివరాముడు, శ్రీశైల రెడ్డి, సోమశేఖర నాయక్, డి.పి.ఓ ఏ.ఓ వెంకటరమణ, ఆర్.ఎస్.ఐ లు వెంకటేశ్వర్లు, స్వామినాయక్, అప్పలనాయుడు, డి.పి.ఓ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
